Monday , November 20 2017
Breaking News
Home / Spiritual / “తొలేకాశి”…..”తొలి ఏకాదశి”….

“తొలేకాశి”…..”తొలి ఏకాదశి”….

Toli Ekadasi

సంవత్సరంలో ఇన్ని ఏకాదశులుండగా, ఈ ఏకాదశినే పెద్ద పండగలా చేసుకోటం ఏంటీ! అందునా సంవత్సరం మధ్యలో వచ్చే ఏకాదశిని “తొలి” ఏకాదశి అనటమేంటీ! ఒక సామెత ఉంది.

“ఉగాదితో పండగలు ఊడ్చుకుపోతయ్యి, తొలేకాశితో తొలకరిస్తయ్యి”.అందుకని దీన్ని తొలేకాశి అంటారు. మనకి తొలకరి వర్షాలు పడేది ఆషాఢమాసంలో మనం వ్యవసాయదారులం. తొలకరి అంటే మనకి పెద్ద పండగ. అందుకని ఆషాఢ శుద్ధఏకాదశిని “తొలి ఏకాదశి” పండగ్గా చేసుకుంటామన్న మాట!”…. “చాతుర్మాస్య వ్రతం” అని ఒక వ్రతం ఉంది….అది ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు.విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు.అందుకని ఆ రోజుని “శయనైకాదశి” అనీ, “తొలి ఏకాదశి” అనీ పిలుస్తారు.

కార్తీకశుద్ధ ఏకాదశినాడు మళ్ళా నిద్రలేస్తాడు,కాబట్టి దాన్ని “ఉత్థాన ఏకాదశి” అనీ, ” చిల్కు ఏకాదశి” అనీ పిలుస్తారు. ఈ నాలుగు నెలలూ యోగులు,సన్యాసులు ఎక్కడికీ కదలకుండా ఒక్కచోటనే ఉండి, ఆ విష్ణువుని అర్చిస్తారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు.చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. కాబట్టి మనం ఆషాఢ శుద్ధఏకాదశిని పండగలా చేసుకుంటాం.సంవత్సరమంతా ఏకాదాశి ఉపవాసాలుంటారు. ఆ ఉపవాసాలని ఇవ్వాళ మొదలెడతారన్నమాట! ఇవ్వాళ మొదలెట్టి ఇరవైనాలుగేకాదశులూ చేస్తారు.కాబట్టి దీన్ని “తొలి ఏకాదశి” అన్నారు…

“పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. “లంఖణం పరమ ఔషధం” అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే “ఏకాదశి” అనీ, ఆమె మూడు వరాలు…
1. సదా మీకు ప్రియముగా ఉండాలి.
2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.
3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి.
అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి.

మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఐతే, అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం.

ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు…
* దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.
* ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
* అసత్య మాడరాదు.
* స్త్రీ సాంగత్యం పనికి రాదు.
* కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
* ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
* మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.
* అన్నదానం చేయడం చాలా మంచిది.

ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే “విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక” మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.

సైన్సు పరంగా మరికొన్ని సూచనలు తెలుసుకుందాం. అందుకే వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారములు తీసుకొనవచ్చును (అన్నం తప్ప). అంతే గాక అనేక ఆరోగ్య రహస్యములు ఇమిడి ఉన్నాయట. “లంఖణం పరమౌషధం” అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు పరిశుద్ధ మౌతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. ఈ విధంగా సైన్సు పరంగానూ, పౌరాణికంగానూ అనేక ఫలితాలనిస్తుందని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి.
ఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములలో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి .

సంవత్సరంలో ఇన్ని ఏకాదశులుండగా, ఈ ఏకాదశినే పెద్ద పండగలా చేసుకోటం ఏంటీ! అందునా సంవత్సరం మధ్యలో వచ్చే ఏకాదశిని "తొలి" ఏకాదశి అనటమేంటీ! ఒక సామెత ఉంది. "ఉగాదితో పండగలు ఊడ్చుకుపోతయ్యి, తొలేకాశితో తొలకరిస్తయ్యి".అందుకని దీన్ని తొలేకాశి అంటారు. మనకి తొలకరి వర్షాలు పడేది ఆషాఢమాసంలో మనం వ్యవసాయదారులం. తొలకరి అంటే మనకి పెద్ద పండగ. అందుకని ఆషాఢ శుద్ధఏకాదశిని "తొలి ఏకాదశి" పండగ్గా చేసుకుంటామన్న మాట!".... "చాతుర్మాస్య వ్రతం" అని ఒక వ్రతం ఉంది....అది ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు.విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు…

User Rating: 5 ( 1 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *